[go: up one dir, main page]

Jump to content

పసుపు

వికీపీడియా నుండి

పసుపు
కురుకుమ లోంగా
పసుపు కొమ్ము, పసుపు పౌడర్
Scientific classification
Kingdom:
Division:
Class:
Subclass:
Order:
Family:
Genus:
Curcuma(కురుకుమ)
Species:
C. longa
Binomial name
Curcuma longa

పసుపు , Turmeric

[మార్చు]

పసుపు (లాటిన్ Curcuma longa) అల్లం (Zingiberaceae) జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెబుతారు. వంటలకు వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. బౌద్ధ శిష్యులు రెండు వేల సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించారని తెలుస్తోంది. భారతదేశంలోని హిందువులు తమ నిత్యజీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. మనదేశంలో పసుపు లేని, వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహారాష్ట్రకు చెందిన సాంగ్లి పట్టణంలో ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు వ్యాపారం జరుగుతుంది. పసుపును కనీసము 3000 సంవత్సరాలనుంది భారతీయులు వాడుతున్నారు . చిన్నచిన్న గాయాలనుండి క్యాన్సర్ వ్యాధులవరకు పసుపు విరుగుడుగా పనిచేస్తుంది . మనదేశములో ఆహారములో రంగు, వాసనలతో పాటు ఔషధగుణాల పేరున పసుపును వాడుతున్నారు . పసుపు క్రిమిసంహారిని ... క్రిములను నసింపజేస్తుంది . శరీరము పై ఏర్పడిన గాయాలకు, పుల్లకు పసుపు పూస్తే సూక్ష్మక్రిములు దరిచేరవు ... సెప్టిక్ అవదు, త్వరగా మానుతుంది . ఇది ప్రకృతి ప్రసాధించిన మహా దినుసు . దీనిలోని " కర్కుమిన్‌ " వాపులను తగ్గిస్తుంది యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది . దీని శాస్త్రీయ నామము " Curcuma longa . పసుపు (లాటిన్ - Curcuma longa), అల్లం (Zingiberaceae) జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెబుతారు.

గుణ గణాలు

[మార్చు]

పసుపు దుంప రూపంలో మెట్ట ప్రాంతాలలో విరివిగా పండుతుంది. దుంపలపై ఉండే చెక్కుతీసి, ఎండ బెట్టి గృహస్థాయిలో తయారుచేసే పసుపును ముఖ్యంగా పూజలకు, ఇంటిలో వంటలకు వాడుతుంటారు. వాణిజ్య పరంగా పసుపుకు చాలా ప్రాముఖ్యం ఉంది. పసుపు దుంపలనుంచి వివిధ ప్రక్రియల ద్వారా పసుపు కొమ్ములు, పసుపు (పొడి) తయారుచేస్తారు. పసుపులో విటమినులు, లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్‌ ఫాస్ఫరస్‌ గూడా అధికంగానే ఉంటుంది. పసుపు రేణువులో వివిధ జీవన ప్రక్రియలకు తోడ్పడే యాంటీ బయోటిక్‌, కాన్సర్‌ నిరోధక, ఇన్‌ఫ్లమేషన్‌ నిరోధించేవి, ట్యూమర్‌ కలుగకుండా వుండే, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కలిగి ఉన్న వందలాది పరమాణువులున్నాయి. పసుపు దుంపల్లో కర్‌క్యుమిన్‌ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఈ కర్‌క్యుమిన్‌ అనే పదార్థం వల్లననే పసుపు సహజమైన పసుపురంగులో ఉంటుంది. ఇప్పటివరకు పసుపులో బంగారు వన్నెలో వుండే కర్‌క్యుమిన్‌, డిమిథాక్సి కర్‌క్యుమిన్‌, బిస్‌డిమిథాక్సి కర్‌క్యుమిన్‌ అనే పదార్థాలపై అత్యంత పరిశోధనలు జరిగాయి. పసుపు దుంపలో కర్‌క్యుమిన్‌ కేవలం 3 నుంచి 5 శాతమే ఉన్నప్పటికీ శరీర సౌందర్యానికి, శరీర ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.

ఎన్నో వ్యాధులకు మందు :

[మార్చు]
  • మొటిమలు : జామ ఆకులు పసుపుతో కలిపి నూరి రాయాలి,
  • కఫము : వేడిపాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి . కఫము తగ్గుతుంది .
  • రక్త శుద్ధి : ఆహారపదార్ధాలలో పసుపు కొద్దిగా వాడితే రక్తశుద్ధి అవుతుంది .
  • దగ్గు, జలుబు : మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పట్టాలి,
  • నొప్పులు, బెనుకులు : పసుపు, ఉప్పు, సున్నము కలిపి పట్టువేయాలి .
  • డయాబెటిస్ : ఉసిరి పొడితో పసుపు కలిపి బీర్లో కరిగించి తాగాలి .మధుమేహవ్యాధి అదుపులో ఉంటుంది. చిన్న గ్లాసు నీళ్ళలో ఒక పసుపు కొమ్ము చేసి రాత్రంతా నానబెట్టి ... పొద్దునా లేచేక పసుపు కొమ్ము తేసేసి నీల్లలు ఒక చెంచాతో బాగా కలిపి పరగడుపున తాగితే చాలు చెక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది . ఈ నీళ్లు కొలెస్టిరాల్ ను, రక్తపోటును అదుపులో ఉంచుతుంది .
  • కాలేయ ఆరోగ్యం :పసుపులో ఉండే ఆంటీ ఆక్సైడ్ లు, అంటి ఇంఫలమథోరి గుణాలు కాలేయ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది
  • తలతిరుగుడు : పసుపు దుంప ముద్దగా దంచి తలపై రాసుకోవాలి .
  • బరువు తగ్గుదల :పసుపులో ఉండే సర్క్యూమిం ఒబేసిటీ ఇంఫలమటిన్ ను తగ్గ్గిస్తుంది [1]
  • డిప్రెషన్, ఆంక్సిటీ :డిప్రెషన్ డిసార్డర్స్, ఆంక్సిటీ ల నుండి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది
  • అల్జిమార్ వ్యాధి : పసుపులో ఉండే "కర్కుమిన్ " అనే పదార్ధము మతిమరుపును అరికడుతుంది.
  • పసుపులో ఉండే కురుకుమిన్ వలన కీళ్ళనోప్పులు, కండరాల నోప్పులు తగ్గటమే కాక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాదుల నుండి కాపాడుతుంది.
  • డయాబెటిస్ ఉన్నవాళ్ళు పసుపు కలిపిన పాలు తాగటం వలన రక్తంలో ఉన్న చక్కెరను తగ్గిస్తుంది దీని వలన షుగర్ అదుపులో ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.[2]

ఆయుర్వేదిక్ గుణాలు :

[మార్చు]
  • పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
  • సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.
  • పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని/ పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు - కరుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.
  • వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
  • పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
  • వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
  • వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.
  • మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి.
  • నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.
  • పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
  • పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
  • దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.
  • పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.
  • రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు.
  • చికెన్‌ఫాక్స్ (ఆట్లమ్మ) వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది.
  • పసుపు కొమ్మును మెత్తగా పొడిచేసి, మజ్జిగలో కలిపి రోజూ ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మవ్యాధులతోపాటు విరేచనాలు- కీళ్లనొప్పులు తగ్గుతాయి.
  • పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పటిస్తుంటే మొటిమలు- మచ్చలు నివారించవచ్చు. చర్మం గరకుదనంపోయి మృదువుగా తయారవుతుంది.
  • పసుపుతో అవిసే పూలు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి ఔషధంగా రోజుకు రెండుమూడు బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకకు ఉపశమనంగా ఉంటుంది.
  • వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.

ఉపయోగాలు

[మార్చు]

చర్మ సౌందర్యానికి

[మార్చు]

పసుపు బాహ్యంగాను, అంతరంగాను శరీర అందానికి తోడ్పడుతుంది. చర్మాన్ని శుభ్రపరచి సక్రమ రీతిలో పోషిస్తుంది. సాంప్రదాయకంగా నువ్వులనూనె, సున్నిపిండితో పసుపు కలిపి స్నానానికి వాడుతుంటారు. అలాగే బాదాంనూనె, మీగడ, తేనెను పసుపుతో కలిపి వంటికి రాసుకొని స్నానం చేస్తే సౌందర్యం ఇనుమడిస్తుంది. వంటిమీద నొప్పి ఉన్నచోట, దెబ్బలు లేదా గాయాలు తగిలినచోట, వాపులవద్ద పసుపు రాస్తే చాలావరకు సంబంధిత బాధలు తగ్గుతాయి. చర్మం మీద మొటిమలు అనేక రుగ్మతలు పసుపు వాడితే తగ్గుతాయి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.[3] పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్ళు, దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకొని దీర్ఘకాలంగా ఉన్న వ్రణాలను శుభ్రంగా కడిగి పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గుతాయి.

ప్రథమ చికిత్స

[మార్చు]

దెబ్బలు, గాయాలు తగిలినపుడు శరీరం నుంచి రక్త స్రావాన్ని ఆపుటకు పసుపు దోహదపడుతుంది. యాక్సిడెంట్లు, ఇతర సంఘటనలతో కొంతమంది మానసిక రుగ్మతలకు గురయినప్పుడు, అలాంటి సమయాలలో ఒక కప్పు వేడిపాలలో రెండు చెంచాల పసుపు, రెండు చెంచాల నెయ్యి కలిపి తాగిస్తే చాలావరకు తేరుకుంటారు. శరీరంలోని వివిధ అవయవాలలో జరిగే ప్రక్రియలు సక్రమంగా నిర్వహించడానికి పసుపు తోడ్పడుతుంది.

పసుపు పాలు.. చేతులు, కాళ్ళ నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయని తెలుసా..? పాలలో పసుపు తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. పసుపును ఆయుర్వేద మూలికలలోనూ ఉపయోగిస్తారు

జీర్ణకోశ సమస్యలకు

[మార్చు]
  • పొట్టలో, జీర్ణాశయంలో గ్యాస్‌ను తగ్గిస్తుంది.
  • హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాల నుంచి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది.
  • గుదం (రెక్టమ్‌) నుంచి రక్తస్రావం జరుగుతుంటే 2 లేదా 3 టీస్పూన్లు పసుపును అన్నంతోగాని, పాలలోగాని కలిపి తీసుకుంటే తగ్గుతుంది.
  • నీళ్ల విరేచనాలు/ రక్త విరేచనాలకు ఒక కప్పు పెరుగులో 10 గ్రా. లేదా 2 టీ స్పూన్లు పసుపు చేర్చి తింటే తగ్గిపోవచ్చు.
  • మూల వ్యాధి (పైల్స్‌) తో బాధపడేవారు పసుపు, ఆవనూనె, ఉల్లిరసం కలిపిన మిశ్రమాన్ని పైల్స్‌ ఉన్నచోట రాస్తే ఉపశమనం ఉంటుందని మన పూర్వీకుల నమ్మకం.

కాలేయం (లివర్‌)

  • విషతుల్యమైన పదార్థాల నుంచి కాలేయానికి హాని కలుగకుండా కాపాడుతుంది.
  • కాలేయంలో తయారయ్యే పిత్తరసం లేదా బైల్‌ ఉత్పత్తిని పెంచుతుంది.
  • ఆల్కహాల్‌ ఎక్కువ తాగేప్పుడు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 5 గ్రా. పసుపును ఒక గ్లాసు నీళ్ళలోగాని, మజ్జిగలోగాని కలిపి నెలరోజులపాటు తాగితే లివర్‌కు ప్రమాదం లేకుండా ఉంటుంది.

శ్వాసకోశ సమస్యలకు

[మార్చు]
  • బయటి కాలుష్యం నుంచి, విషతుల్యమైన పదార్థాల నుంచి శ్వాసకోశాన్ని రక్షిస్తుంది.
  • ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్‌ నెయ్యి, 4-5 గ్రా. పసుపు కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది. ఆస్మా నుంచి ఉపశమనం ఉంటుంది.
  • నేతిలో ఒక స్పూన్‌ పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లులి వేసి వేయించి, వాసన పీల్చి తింటే బ్రాంకైటిస్‌ వున్నవారికి మందు బాగా పనిచేస్తుంది.
  • స్త్రీలలో నెలసరి సక్రమంగా జరగటానికి దోహదపడుతుంది.
  • బహిష్టులో వున్నప్పుడు ఎలాంటి నొప్పులు రాకుండా చేస్తుంది.
  • స్త్రీల గర్భసంచిలో ట్యూమర్‌ రాకుండా తోడ్పడుతుంది.
  • రొమ్ములో కాన్సర్ రాకుండా నివారిస్తుంది.

ఇతర ఉపయోగాలు

[మార్చు]
  • రక్తంలో చెడు (ఎల్‌.డి.ఎల్‌) కొలెస్టెరాల్‌ మోతాదును తగ్గించి గుండెజబ్బులు రాకుండా చూస్తుంది.
  • పసుపులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

క్యాన్సర్‌ను చంపే పసుపు

[మార్చు]

పసుపు శరీరంలోని ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయం, నోరు వగైరా భాగాలలో కాన్సర్‌ రాకుండా నివారిస్తుంది. పసుపు శరీరంలో కాన్సర్‌ దరి చేరలేని పరిస్థితులు కల్పిస్తూ, శరీరంలోని వివిధ కణాలను కాన్సర్‌ ఎదుర్కొనేట్లు చేస్తుంది. ఎప్పుడైనా కణితి (ట్యూమర్‌) ఏర్పడితే దాన్ని నిర్మూలించేట్లు చేస్తుంది.పసుపుకు క్యాన్సర్‌ కణాలను తుదముట్టించే సామర్థ్యం ఉన్నట్లు, పసుపులో ఉండే కర్కుమిన్‌ అనే రసాయనానికి 24గంటల్లోపే క్యాన్సర్‌ కణాలను చంపే శక్తి ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. కర్కుమిన్‌కు గాయాలు నయం చేయడంతోపాటు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే శక్తి ఉంది.[4]

పసుపుతో కాలేయానికి రక్ష

[మార్చు]

కాలేయం పనితీరును దెబ్బతీసే తీవ్రమైన సిరోసిస్‌ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది.పసుపులో ఉండే 'కర్కుమిన్‌' అనే పదార్థం కాలేయం కణాల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.పసుపులో ఉండే వర్ణకం పిత్త వాహికల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చూస్తుంది.

అల్జీమర్స్ వ్యాధి నివారణకు

[మార్చు]
  • అల్జీమర్స్ వ్యాధి ఉన్న రోగులలో, పసుపు వారి మెదడు పనితీరును మెరుగుపరిచింది. పసుపులోని కర్కుమిన్ యొక్క యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ ప్రభావానికి కారణమని చెప్పవచ్చు.
  • పసుపులోని మరొక రసాయనం టుమెరోన్. జంతు అధ్యయనాలలో, టుమెరోన్ కొత్త మెదడు కణాలను ప్రేరేపించిందని తెలిసింది. అల్జీమర్స్ వ్యాధి, ఇతర న్యూరోడీజనరేటివ్ పరిస్థితులకు చికిత్స చేయడానికి టుమెరోన్ బాగా సహాయపడుతుంది.
  • పసుపులోని కర్కుమిన్ డయాబెటిస్ ఉన్నవారిలో కూడా మెదడు పనితీరును పెంచుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడం ద్వారా ద్వారా డయాబెటిక్ న్యూరోపతిని నిరోధిస్తుంది.

కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెకు రక్షణ కల్పిస్తుంది

[మార్చు]
  • ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మరణించే వాళ్లలో 31% మంది హృదయ సంబంధిత వ్యాధుల వల్ల మరణిస్తున్నట్లు తెలుస్తున్నది. అంటే దాదాపు 18 మిలియన్ల మంది!
  • పసుపులోని కర్కుమిన్ గుండె జబ్బులను నివారిస్తుంది. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కార్డియోటాక్సిసిటీ, డయాబెటిస్ సంబంధిత గుండె సమస్యలను నివారిస్తాయి.
  • పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సక్రమంగా లేని హృదయ స్పందనలను నివారిస్తాయి.
  • ఎలుకలపై చేసిన అధ్యయనాలలో, కర్కుమిన్ రక్తపోటుకు కూడా చికిత్స చేసిందని తేలింది. రక్తపోటుకు చికిత్స చేయకపోతే, అది గుండెపోటుకు దారితీస్తుంది. తీవ్రమైన కొరోనరీ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులలో, కర్కుమిన్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించింది.[5]

మధుమేహంను నివారిస్తుంది

[మార్చు]

curcumin రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిస్తుంది, తద్వారా మధుమేహం నిరోధించడానికి సహాయపడ్తుంది. మధుమేహంతో సంబంధం ఉన్న కాలేయ లోపాల చికిత్సలో పసుపు రంగులో ఉండే కర్కుమిన్ కూడా సహాయపడుతుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి, ప్యాంక్రియాటిక్ బీటా-కణాల పనితీరును మెరుగుపరచడానికి, గ్లూకోస్ను మెరుగుపర్చడానికి కర్కుమిన్ ఉపయోగపడ్తుంది.[6]

పసుపు ధర, పంటల వివరాలు

[మార్చు]

పసుపునకు ఇంతవరకూ ఎన్నడూ లేని విధంగా 2010 నవంబరు 26 నాడుఎక్కువ ధర క్వింటాలు ధర రూ. 15,200 నుంచి రూ.16,000 వరకు పలుకుతుంది. నిజామాబాద్లో పసుపు ఎక్కువగా పండిస్తారు. నిజామాబాద్ మార్కెట్ లోని ధర 16 వేల రూపాయలు ఉంది. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మార్కెట్ లో కూడా పసుపు ఎక్కువగా అమ్ముతారు. దుగ్గిరాల మార్కెట్ లో 2010 నవంబరు 26 శుక్రవారం 15,200 రూపాయల ధర పలికింది. 2010 నవంబరు 6 నుంచి పసుపు ధర పెరగటం మొదలై 2010 నవంబరు 26 నాటికి రూ. 1500 పెరిగింది. రాబోయే ఒకటి, రెండు నెలల్లో ధరలు బాగా పెరుగుతాయని అంటున్నారు. స్టాక్ మార్కెట్ (కమోడిటీస్ ) లో కూడా పసుపు డిసెంబరు ధర రూ. 16000 ఉంది. ధరలు పెరగటానికి 6 కారణాలు 1. కొత్త పంట మార్కెట్ కు రావటానికి మరొక రెండు, మూడు నెలలు ( 2011 జనవరి ఫిబ్రవరి) కాలం పడుతుంది. 2. రైతుల దగ్గర నిల్వలు తక్కువగా ఉన్నాయి. 3. ఎగుమతులు పెరిగాయి (విదేశాలకు, ఉత్తర భారత దేశానికి) 4. పసుపు పంట విస్తీర్ణం తగ్గటం. 5. గల్ఫ్ దేశాలు, బంగ్లాదేశ్ నుంచి కొనుగోళ్ళు బాగా చేస్తున్నారు. 6. ధరలు ఇంకా పెరుగుతాయని, రైతులు పసుపు బస్తాలు కొద్ది కొద్దిగా తెచ్చి మార్కెట్ లో అమ్ముతున్నారు. నిజామా బాద్ లో ప్రతీ సంవత్సరం మొదట జనవరి 15 తర్వాత పసుపు పంట రావటం మొదలవుతుంది. జూన్ 15 తరువాత, గుంటూరు, కడప జిల్లాలలో పంట మార్కెట్ కి వస్తుంది. కడప, నిజామా బాద్ జిల్లాల రైతుల దగ్గర 15,000 నుంచి 20,000 బస్తాలు (బస్తా అంటీ 70 కి.గ్రా అంచనాగా), గుంటూరు జిల్లా లోని రైతుల దగ్గర 55,000 నుంచి 60,000 బస్తాలు ఉండవచ్చని ఈ నాటి అంచనాలు. పసుపు ధర పెరగడంతో, రైతులు పసుపు పంట ఎక్కువగా పండిస్తున్నారు. ఫలితంగా, పసుపు పంట విస్తీర్ణం దేశమంతటా పెరిగింది. తమిళనాడు, ఒరస్సా, కేరళ, మహారాష్ట్రలు కూడా పసుపు పండిస్తాయి. భారత దేశ అవసరాలకి, ఎగుమతులకు 50 నుంచి 55 లక్షల బస్తాల పసుపు సరిపోతుందని ఒక అంచనా. రాబోయే పంట 65 నుంచి 70 లక్షల బస్తాలని అంచనా వేస్తున్నారు. విత్తనం ధర బాగా పెరగడంతో ఎకరానికి కావలసిన విత్తనం కోసం రూ. 60 వేల నుంచి 70 వేల వరకు ఖర్చు పెడుతున్నట్లు అంచనా. అలాగే వర్షాలు ఎక్కువగా కురియటం వలన 10 నుంచి 15 శాతం వరకు పసుపు దిగుబడి తగ్గుతుందని కూడా మరొక అంచనా. ఇవి అన్నీ లెక్క వేస్తే, రాబోయే పంటకు కనీస ధర క్వింటాలుకి రూ.9000 ఉంటే రైతు నష్టాలు లేకుండా గట్టెక్కుతాడు. ఇతర వాణిజ్య పంటలైన పొగాకు, పత్తి పంటలకు ఇచ్చినట్టే, పసుపునకు కూడా మద్దత్తు ధర ఇవ్వాలని, పసుపు రైతులు కోరుతున్నారు.

పసుపునకు మద్దత్తు ధర

[మార్చు]

స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో, ఆంధ్ర రాష్ట్ర పసుపు రైతులు 2010 నవంబరు 26 శుక్రవారం నాడు క్వింటాల్ పసుపునకు 15,000 రూపాయల మద్దత్తు ధర కావాలని, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరులో ప్రత్యేక పసుపు బోర్డు (గుంటూరులో పొగాకు బోర్డు ఏర్పాటు చేసినట్లు), పసుపు ఆధారంగా ఏర్ఫడే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఢిల్లీలోని నాయకులను కలిసి తమ సమస్యలను విన్నవించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

పసుపు నూనె

వనరులు, మూలాలు

[మార్చు]
  1. https://www.stylecraze.com/articles/turmeric-history-how-to-use-benefits/
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-02-27. Retrieved 2020-04-09.
  3. "శరీర లావణ్యాన్ని పెంచే పసుపు". Archived from the original on 2015-04-24. Retrieved 2015-03-17.
  4. (ఆంధ్రజ్యోతి 29.10.2009)
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-03. Retrieved 2020-06-03.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-03. Retrieved 2020-06-03.

బయట లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పసుపు&oldid=4013588" నుండి వెలికితీశారు